జయజయ శంకర హర హర శంకర
శ్రీలలితా త్రిపురసుందరీ దేవాలయము, కర్నూలు
శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం
శ్రీ లలితా త్రిపుర సుందరి ఆలయం – కర్నూలు
భగవత్ బంధువులకు,
మన భరతమాత పుణ్యవతి.
అనేక పుణ్యతీర్థములు పుణ్యనదీ నదములు పవిత్ర ఉత్తుంగ శిఖరములు, అనేక మహారణ్యములకు ఆలవాలమై సనాతన వేద ధర్మము విరాజిల్లుతూ ఆధర్మమునకు విరుద్ధ పరిస్థితులు ఏర్పడినప్పుడు పరమాత్మ అనేక అవతారములు దాల్చుతూ ఎందరో ధర్మపురుషుల బోధనలతో పునీతయుగు ఈ భూమి యందు బౌద్ధ, జైన, కాపాలిక, చార్వాక పాషండ మతములతో ప్రజల జీవన స్థితిగతులు అల్లకల్లోలమైన సందర్భమున క్రీ.శ. 7వ శతాబ్ది యందు కేరళ రాష్ట్రం కాలడి యను గ్రామమునందు నంబూద్రి బ్రాహ్మణ కుటుంబ మున సాక్షాత్తు శంకరులు ఆర్యాంబ శివగురు పుణ్యదంపతుల గర్భమున ఆదిశంకర రూపమున ఆవిర్భవించిరి.
తన ఐదవ సంవత్సరమునే సన్యసించి నర్మదాతీర వాసియైన గోవిందపాద యతివర్యుల వద్ద శిష్యరికం చేసి అనేక విద్యలను అభ్యసించి కాశీ క్షేత్రమందు విశ్వేశ్వరున్ని దర్శించి ఆ గంగా నదీ తీరమున బ్రహ్మసూత్రములు, ఉపనిషత్తులు, భగవద్గీతకు అద్వైత సిద్ధాంతము మూలముగా భాష్యములు రచించి, అవి జగత్ప్రచారముగావింప సంసిద్ధులై మాహిష్మతీపుర వాసియైన మండనమిశ్రులతో వాదము చేయ నారంభించి ఉభయభారతిని న్యాయ నిర్ణేతగా చేసుకొని ఆవాదనలో మండనమిశ్రుని ఓడించి సురేశ్వరాచార్య నామముతో సన్యాసదీక్ష యొసంగి తన శిష్యునిగా స్వీకరించి పద్మపాదుడు హస్తామలకుడు, తోటకా చార్యులని శిష్యులుగా గ్రహించి సనాతన వైదిక ధర్మమును పునరుద్ధరింపనెంచి భారతదేశ నలుచెరగుల నాలుగు పీఠములు, నాలుగు మహావాక్యముల ఆధారముగా స్థాపించి. అనేక ప్రకరణ గ్రంథములు, స్తోత్రములు రచించి శిష్యులకు జ్ఞానబోధ చేసి తన ముప్పదిరెండవ సంవత్సరమున కేదార్ నాథ్ మీదుగా కైలాసమును చేరిరి.
ఆదిశంకరులు స్థాపించిన 4 పీఠములలో తలమానికమగు పీఠము దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠము.
ఈ పీఠ ప్రథమ గురువు సురేశ్వరాచార్యులు.
ఈ జగద్గురు పరంపరలో ప్రస్తుతం ముప్పది ఆరు, ముప్పది ఏడవ పీఠాధిపతులుగా పరమహంస పరివ్రాజకాచార్యవర్యులు శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థమహాస్వామి, వీరి కర కమల సంజాతులు శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీస్వాములు నడయా డుచూ ఈ పుడమిపై సనాతన ధర్మ ప్రచారం చేస్తూ భగవదారాధనా వైశిష్ట్యమును తెలుపుతూ ఎందరికో ధర్మ సందేహములు తీర్చుతూ వారి పాద సేవాభాగ్యమును మనకు అందిస్తున్నారు.
వారికి శత సహస్ర ప్రణామములు సమర్పిస్తున్నాను.